రైతుల హక్కులకు బలమైన అడుగు… గంగలకుర్రులో పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ
అమలాపురం, ఏప్రిల్ 08:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగలకుర్రు గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమం రైతులకు నూతన ఆశలను కలిగించింది. భూమి రైతుకు జీవనాధారం మాత్రమే కాకుండా గౌరవం, భద్రతకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భూ హక్కులు స్పష్టంగా ఉండటం ప్రతి రైతుకు అత్యంత అవసరమని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల శుద్ధి కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ కార్యక్రమం పారదర్శకంగా కొనసాగుతూ రైతులకు భద్రత కల్పిస్తోందన్నారు.
గంగలకుర్రు గ్రామంలో మొత్తం 1,534 ఖాతాలకు డ్రాఫ్ట్ ROR సిద్ధం చేయగా, రైతులు స్వయంగా తమ భూ రికార్డులను పరిశీలించి వ్యక్తిగత వివరాలు, భూమి విస్తీర్ణంలో ఉన్న పొరపాట్లను గుర్తించి తెలియజేయడం అభినందనీయం అన్నారు.
సమగ్ర పరిశీలన అనంతరం 586 ఖాతాలు పూర్తిగా సరిగా ఉన్నట్లు నిర్ధారించబడగా, ఈ ఖాతాలకు సంబంధించిన పట్టాదారు పాసుబుక్కులను ఈ రోజు పంపిణీ చేయడం ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ 586 మంది రైతులకు అభినందనలు తెలియజేశారు.
అయితే మిగిలిన ఖాతాల్లో ఉన్న లోపాలను త్వరితగతిన సరిచేయాలని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా రెవెన్యూ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు భూ రికార్డులు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇదే సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేశనపల్లి, రాజోలు ప్రాంతాల్లో కొబ్బరి తోటల నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన విషయాన్ని గుర్తుచేశారు. డ్రైనేజీ సమస్యలు, ఉప్పునీటి ప్రభావంతో వేల ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయని గుర్తించి, శాశ్వత పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. రైతుల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.