రవ్వ ప్లాంట్ను ముట్టడించిన నిరుద్యోగులు… హామీలు అమలు చేయాలంటూ ఆందోళన ఉదృతం
అమలాపురం, ఏప్రిల్ 08:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం గ్రామంలో ఉన్న వేదాంత ఆయిల్ కంపెనీ (రవ్వ ప్లాంట్)ను స్థానిక నిరుద్యోగులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. గత రెండు రోజులుగా ప్లాంట్ కార్యకలాపాలను నిలిపివేసి నిరవధిక ధర్నా కొనసాగిస్తున్నారు.
గత సంవత్సరం 100 ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెల్లవారుజాము నుంచి నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. కార్మికులను కూడా ప్లాంట్లోకి అనుమతించకుండా అడ్డుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు. రాత్రివేళల్లో కూడా ప్లాంట్ వద్దే నిద్రాహారాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆందోళనకు నాయకత్వం వహించిన నేతలు మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా గ్రామస్తులకు తగిన ఉద్యోగాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల నుంచి వందలాది మంది కార్మికులను తీసుకువస్తున్నారని ఆరోపించారు. ప్లాంట్లో సుమారు 700 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా, మెజారిటీ ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని పేర్కొన్నారు.
గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని పలుమార్లు ఆందోళనలు చేసినప్పటికీ, యాజమాన్యం హామీలు ఇచ్చి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో సమక్షంలో జరిగిన చర్చల్లో కూడా ఉద్యోగాలపై హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు.
ప్లాంట్ వల్ల కాలుష్యం పెరిగి పంట భూములు దెబ్బతిన్నాయని, గ్రామ ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు. కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత సంవత్సరం ఫిబ్రవరిలో స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో జరిగిన చర్చల్లో 2025 సెప్టెంబర్లో 25 ఉద్యోగాలు, 2026 మార్చిలో మరో 25 ఉద్యోగాలు, భవిష్యత్తులో మరో 50 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటి వరకు అమలు చేయలేదని పేర్కొన్నారు.
ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి 100 ఉద్యోగాలు కల్పించాలని, ఎర్ర వంతెన నుంచి ఎస్.యానం వరకు రహదారి అభివృద్ధి చేయాలని, గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, గ్రీన్ ప్లాంట్ అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి, ఎన్ని రోజులైనా ప్లాంట్ కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.