ఖతార్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళను సురక్షితంగా స్వదేశానికి చేర్చిన జిల్లా యంత్రాంగం
అమలాపురం, ఏప్రిల్ 08:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామానికి చెందిన జగడం విజయలక్ష్మి (37) ఖతార్ దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ రావిరాల చొరవతో సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు.
వివరాల ప్రకారం, గతంలో రెండు సార్లు కువైట్‌లో పని చేసిన విజయలక్ష్మి అప్పుల భారం కారణంగా 2025 నవంబర్ 15న మొల్లి సత్యనారాయణ అనే ఏజెంట్ ద్వారా ఖతార్‌కు వెళ్లారు. అక్కడ వెంకీ అనే వ్యక్తి ద్వారా ఒక ఇంటిలో పనికి పెట్టగా, రెండు నెలలు పనిచేసి జీతం కూడా పొందారు.
తర్వాత ఆరోగ్యం క్షీణించి కుడి చేయి వాచిపోవడంతో తీవ్ర నొప్పితో బాధపడుతూ పనిచేయలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇంటి యజమాని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ సమయంలో ఏజెంట్‌ను సంప్రదించగా, లక్ష రూపాయలు చెల్లిస్తేనే స్వదేశానికి పంపిస్తామని చెప్పడంతో అప్పు చేసి డబ్బులు చెల్లించినా, నెలరోజుల పాటు ఎటువంటి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
దీంతో వారు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను ఆశ్రయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిర్యాదు అందుకున్న వెంటనే కేంద్ర బృందం స్పందించి సంబంధిత ఏజెంట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించి విజయలక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు కేంద్ర సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కడియాల సత్తిబాబు, షేక్ బీబి సఫియా తదితరులు పాల్గొన్నారు.
👉 విదేశాలకు వెళ్లే ముందు అధికారిక మార్గాలు అనుసరించాల్సిన అవసరాన్ని అధికారులు సూచిస్తున్నారు.