పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట… యువతకు స్వయం ఉపాధి అవకాశాల విస్తరణపై కలెక్టర్ దృష్టి
ప్రజా ఆయుధం దినపత్రిక
పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట… యువతకు స్వయం ఉపాధి అవకాశాల విస్తరణపై కలెక్టర్ దృష్టి
అమలాపురం, ఏప్రిల్ 08:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తూ, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన 19వ జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశాన్ని ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొబ్బరి పీచు (క్వాయర్) ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం నిర్మిస్తున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, ఎంఎస్ఎంఈ పార్క్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీఐఐసీ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలన్నారు.
క్వాయర్ బోర్డు సహకారంతో జిల్లాలో అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల తయారీ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. క్వాయర్ జియో-టెక్స్టైల్స్ మ్యాట్లు, ఫైబర్ ఫిట్స్, రబ్బరైజ్డ్ మెట్రెస్సులు, అలంకరణ వస్తువుల తయారీని ప్రోత్సహించాలన్నారు.
పర్యావరణహిత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తూ, వక్క మరియు అరటి ఆకులతో విస్తరాకుల తయారీ యూనిట్లను నెలకొల్పేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు. దీనివల్ల ప్లాస్టిక్ వినియోగం తగ్గడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద సముద్రపు నాచు పెంపకం మరియు ప్రాసెసింగ్ కోసం 200 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని మత్స్యశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులకు ఆదేశించారు. వీరికి సబ్సిడీ రుణాలు, శిక్షణ అందించి తీర ప్రాంత ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.
జిల్లాలో ఉత్పత్తి అయ్యే ఖాదీ, చేనేత ఉత్పత్తుల విక్రయాలను విస్తరించేందుకు ఆర్టీసీ డిపోలు, రైతు బజార్లు, ప్రధాన కూడళ్లలో ప్రదర్శన-విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీఐపీ స్టోర్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెటింగ్‌ను బలోపేతం చేయాలని తెలిపారు.
సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు నిర్ణీత గడువులో అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పారిశ్రామికవేత్తలకు, స్వయం ఉపాధి పొందే అభ్యర్థులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో ఏపీఐఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాధామణి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అరుణ, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ అంబటి భూలక్ష్మి, డిపిఓ శ్రీనివాసరావు, ఎల్డిఎం కేశవ్ వర్మ, డిహెచ్ఓ బి.వి రమణ, పంచాయతీరాజ్ ఎస్సీ పులి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![]()