ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం – పంచాయతీ కార్యదర్శి దంపతుల మృతి”
ప్రజా ఆయుధం దినపత్రిక
“ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం – పంచాయతీ కార్యదర్శి దంపతుల మృతి”
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట, ఏప్రిల్ 06
మండపేట మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఉండమట్ల వీర్రాజు దంపతులు ఖమ్మం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం సమీపంలోని రహదారిపై జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారి కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉండమట్ల వీర్రాజు గతంలో మండలంలోని ఏడిద పంచాయతీలో ఇన్ఛార్జ్ కార్యదర్శిగా పనిచేసి గ్రామస్తుల ప్రశంసలు పొందారు. పాలకవర్గంతో సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధికి విశేష కృషి చేసి పంచాయతీకి పలు అవార్డులు తీసుకువచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అంకితభావంతో సేవలందించారు. ప్రస్తుతం ధవళేశ్వరం పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
వీర్రాజు మృతితో స్వగ్రామం అంగరలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అని, గ్రామాభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు.
కుటుంబ పరిస్థితులు కూడా క్లిష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ విషాదం మరింత బాధాకరంగా మారింది. ఆయన తండ్రి అనారోగ్యంతో ఉండగా, కుమారుడు మానసిక వికలాంగంతో బాధపడుతున్నాడు. భార్య కూడా అనారోగ్యంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దంపతులు ఇద్దరూ మృతి చెందడం బంధువులను, గ్రామస్తులను కన్నీళ్ల పర్యంతం చేసింది.
వీర్రాజు మృతిపై మండపేట మండల పరిషత్ ఉద్యోగులు, సిబ్బంది, ఎంపిడిఓ సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీఓలు శ్రీనివాస్, అనిల్ కుమార్, ఏడిద మాజీ సర్పంచ్ బూరీగ ఆశీర్వాదం, ద్వారపూడి పంచాయతీ కార్యదర్శి ఆకుల రమణ, జగ్గంపేట డిప్యూటీ ఎంపీడీఓ సుబ్బారావు, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
![]()