డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం రూరల్, ఏప్రిల్ 06
అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ పరిధిలోని రంగాపురంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్మశాన వాటిక ఆక్రమణకు గురవుతోందంటూ బాధితులు జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
రంగాపురానికి చెందిన మాల, మాదిగ సామాజిక వర్గాల వారు పూర్వీకుల కాలం నుండి కులాల వారీగా స్మశాన వాటికలు ఉన్నప్పటికీ, తమకు కేటాయించిన స్మశాన వాటికను బీసీ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్‌కు వివరించారు.
గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగినప్పుడు అప్పటి ఆర్డీవో సంపత్ కుమార్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన పరిశీలించి ఎస్సీల స్మశాన వాటికపై ఇతరులకు హక్కు లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. అప్పట్లో సమస్య సర్దుమనిగినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ అదే తరహాలో ఆక్రమణకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ కట్టడాలు నిర్మించేందుకు ఇప్పటికే నిర్మాణ సామగ్రి తీసుకువచ్చారని, అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే దౌర్జన్యానికి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమకు రక్షణ కల్పించి స్మశాన వాటికను కాపాడాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్, స్మశాన వాటిక ఆక్రమణ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు.