అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి
అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 31: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ), ఆశా వర్కర్లు, యానిమేటర్లు కలిసి అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, యానిమేటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అలాంటి ఫ్రంట్లైన్ మహిళా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లైన తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, సేవా నిబంధనల అమలు, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వారి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే వారు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సేవలో ముందుండే మహిళా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పక్షాన నిలుస్తుందని, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, యానిమేటర్ల హక్కుల సాధన కోసం జరిగే ప్రతి ఉద్యమానికి పూర్తి మద్దతు అందిస్తామని, అవసరమైతే వారి తరఫున మరింత బలంగా పోరాడతామని చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. నిరసనలో పాల్గొన్న వారందరికీ సంఘీభావం తెలుపుతూ, వారి సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
![]()