అమలాపురంలో దస్తావేజు లేఖర్ల పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి
అమలాపురంలో దస్తావేజు లేఖర్ల పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 31: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు మరియు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శతాబ్దకాలంగా ప్రజల ఆస్తుల రక్షణలో, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో విశ్వసనీయ సేవలు అందిస్తూ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్న దస్తావేజు లేఖర్లను పక్కనపెట్టి ప్రభుత్వం జీవో నెం.396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. దస్తావేజు లేఖర్లు కేవలం ఒక వృత్తిలో ఉన్న వ్యక్తులు మాత్రమే కాదని, ప్రజల ఆస్తుల భద్రతకు ఎన్నో సంవత్సరాలుగా వారే ఒక నమ్మకమైన వారధిగా నిలిచారని అన్నారు. అలాంటి వ్యవస్థను బలహీనపరుస్తూ ఆర్ఎస్కే కేంద్రాల పేరుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించాలనే ప్రభుత్వం ఆలోచన ప్రజల ఆస్తుల భద్రతకే ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చిన్నచిన్న సంస్కరణల ప్రతిపాదన వచ్చినప్పుడే ప్రజల ఆస్తులు ప్రమాదంలో పడతాయని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, ఈరోజు పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ వ్యవస్థనే ప్రైవేటు చేతుల్లో పెట్టే ప్రయత్నం చేయడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. గతంలో చెప్పిన మాటలకు, నేడు అమలు చేస్తున్న విధానాలకు ఎలాంటి పొంతన లేదని విమర్శించారు. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖ ఐజీతో జరిగిన సమావేశంలో దస్తావేజు లేఖర్లను కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పడం ద్వారా ప్రభుత్వం జీవో అమలుపై ముందుకెళ్లే ఉద్దేశంతో ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే రెండు నాలుకల ధోరణిని విడిచిపెట్టి దస్తావేజు లేఖర్లకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, అవసరమైతే వారికి అధికారిక లైసెన్సులు ఇచ్చి ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధంగానే సేవలు అందించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వల్ల నేరుగా ఐదు నుంచి ఆరు వేల మంది దస్తావేజు లేఖర్లు మాత్రమే కాదు, వారి ఆధారంగా జీవిస్తున్న డీటీపీ ఆపరేటర్లు, టైపిస్టులు, స్టాంపు విక్రేతలు, డాక్యుమెంట్ తయారీకి సంబంధించిన అనేక మంది సిబ్బంది సహా సుమారు 20 వేల మందికి పైగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వేలాది కుటుంబాల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖర్ల న్యాయబద్ధమైన డిమాండ్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారి సమస్యలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రాబోయే రోజుల్లో వారికి పూర్తి న్యాయం జరిగేలా కృషి చేస్తామని చిర్ల జగ్గిరెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల ఆస్తుల భద్రతను కాపాడే విధంగా ప్రభుత్వం వెంటనే జీవో నెం.396ను ఉపసంహరించుకుని, దస్తావేజు లేఖర్ల హక్కులను పరిరక్షించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![]()