కుల రాజకీయాలు చేస్తుందెవరు..? కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా?: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
కుల రాజకీయాలు చేస్తుందెవరు..? కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా?: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
ప్రజా ఆయుధం దినపత్రిక: మండపేట, జూలై 31: కుల రాజకీయాలు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ నాయకులేనని మండపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. మండపేట విజయలక్ష్మి నగర్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించారని ఆరోపించారు. ప్రస్తుతం కాపులకు బీసీ కోటా గానీ, కేంద్ర ప్రభుత్వం కల్పించే ఈడబ్ల్యూఎస్ కోటా గానీ అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్లు రద్దు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. ఒకవేళ జగన్ రిజర్వేషన్లు రద్దు చేసి ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడిచిన తర్వాత కూడా వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికీ జగన్ అధికారమే కొనసాగుతోందా అని ఎద్దేవా చేశారు. కుల రాజకీయాల పేరిట రాష్ట్రంలో విభజన సృష్టిస్తున్నది తెలుగుదేశం పార్టీయేనని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లగా విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, ఆ జనసందోహాన్ని చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ ప్రభుత్వ బాధ్యతేనని, దానిని కూడా రాజకీయంగా మలచడం తగదన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మంత్రులు ఉండగానే కృష్ణా జిల్లా నుంచి మంత్రి పార్థసారథిని పంపించడం కుల రాజకీయాలు కాదా అని ప్రశ్నించారు. కాపుల గురించి మాట్లాడితే కుల రాజకీయాలు అంటున్నారని, కానీ ఎన్నికల హామీలను విస్మరించడం మాత్రం సమర్థించుకుంటున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, అనంతరం ఆ హామీని అమలు చేయలేదని గుర్తు చేశారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసినప్పుడు ఆయన కుటుంబాన్ని అవమానించారని ఆరోపించారు. ఎన్నికల ముందు అమలు చేయలేని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కాపులకు ఆత్మాభిమానం ఎక్కువని, వారి విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ కోఆప్షన్ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ రాజబాబు, రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లా వీరబాబు, రాష్ట్ర వైఎస్సార్టీసీ కార్యదర్శి శెట్టి నాగేశ్వరరావు, వాసిరెడ్డి అర్జున్, మాజీ దేవస్థానం చైర్మన్ సూరంపూడి సత్యప్రసాద్, శివ భగవాన్, మాజీ విప్ పోతంశెట్టి ప్రసాద్, జడ్పీటీసీ పుట్టపూటి సత్యనారాయణ, టౌన్ కన్వీనర్ పిల్లి శ్రీను, మాజీ కౌన్సిలర్ ముక్కాదాళియ్యా, మెండు బాపిరాజు, మారేడుబాక మాజీ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.
![]()