గోదావరి వరదలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్
గోదావరి వరదలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 31: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి అందుతున్న సమాచారం మేరకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పరిస్థితిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవితో కలిసి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని, సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఆగస్టు 2న సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య సుమారు 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని 19 మండలాల్లో, ముఖ్యంగా సెంట్రల్ డెల్టా పరిధిలోని 16 నుంచి 17 మండలాలు వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మొదటి హెచ్చరిక సమయంలో పి. గన్నవరం మండలంలోని జి. పెదపూడి వద్ద రహదారి రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని, రెండో హెచ్చరిక నాటికి 6 నుంచి 7 మండలాల పరిధిలోని 32 లంక గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశముందని తెలిపారు. వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, మోటరైజ్డ్ బోట్లు, లైఫ్ జాకెట్లు, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచడంతో పాటు రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య, విద్య, ఆర్ అండ్ బి, విద్యుత్, తాగునీటి సరఫరా తదితర శాఖల అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు జిల్లా అధికారుల, సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకులు, తాగునీటిని లంక గ్రామాలకు ముందుగానే పంపిణీ చేస్తున్నామని, పింఛన్ల పంపిణీకి కూడా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలు రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు గోదావరి నదిలోకి దిగకుండా ఉండాలని, ఎలాంటి సాహసాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కోటిపల్లి, నరసాపురం, సోంపల్లి తదితర ప్రాంతాల్లో పడవ రవాణాను తాత్కాలికంగా నిలిపివేసినందున ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు అనుమతించిన ప్రదేశాల్లో మాత్రమే లైఫ్ జాకెట్లు ధరించి సిబ్బంది పర్యవేక్షణలోనే నీటిని దాటాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని, సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు స్పందించి అవసరమైన చర్యలు చేపడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి సి.హెచ్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
![]()