ప్రమాదరహిత డిపోగా అమలాపురాన్ని తీర్చిదిద్దాలి: ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయరత్నం
ప్రమాదరహిత డిపోగా అమలాపురాన్ని తీర్చిదిద్దాలి: ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయరత్నం
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 31: ప్రమాదాల నివారణకు ప్రతి ఉద్యోగి ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ జోన్–2 (విజయవాడ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయరత్నం సూచించారు. ప్రమాద రహిత వారోత్సవాల సందర్భంగా గురు, శుక్రవారాల్లో ఆయన అమలాపురం డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా కార్గో సేవలు, బస్‌స్టేషన్ పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గ్యారేజ్‌లోని వివిధ విభాగాలను తనిఖీ చేసి వాహనాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై మార్గదర్శకాలు ఇచ్చారు. డ్రైవర్లు, మెకానికల్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. రహదారి భద్రతపై అవగాహన పెంచుకుని ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా అమలాపురం డిపోను ప్రమాదరహిత డిపోగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలు అందించవచ్చని తెలిపారు. అనంతరం పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు ఉద్యోగులను సత్కరించి, సంస్థకు వారు అందించిన సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం జిల్లా ప్రజా రవాణా అధికారి సత్యనారాయణ, డిప్యూటీ సీఎంఈ (రాజమండ్రి) రవిశంకర్, డిపో మేనేజర్ శర్మ, ఉద్యోగ సంఘాల నాయకులు, గ్యారేజ్, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
![]()