భోగాపురం ఎయిర్పోర్ట్ దేశానికే తలమానికం.. అభివృద్ధి సంకల్పానికి చిరునామా: మంత్రి వాసంశెట్టి సుభాష్
భోగాపురం ఎయిర్పోర్ట్ దేశానికే తలమానికం.. అభివృద్ధి సంకల్పానికి చిరునామా: మంత్రి వాసంశెట్టి సుభాష్
ప్రజా ఆయుధం దినపత్రిక: భోగాపురం, జూలై 31: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో స్వర్ణయుగానికి నాంది పలికే ప్రాజెక్టుగా నిలవబోతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానున్న సందర్భంగా సభా వేదిక వద్ద చేపట్టిన బ్యూటిఫికేషన్, క్లీన్ అండ్ గ్రీన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రం నేడు ప్రపంచ పెట్టుబడిదారులు ఎదురుచూసే రాష్ట్రంగా మారిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సమిష్టి కృషితో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి బాటలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం విమానాశ్రయం మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వేగా నిలుస్తుందని తెలిపారు. దీనివల్ల ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, పర్యాటకం, హోటల్ రంగాల్లో భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా చేరవేయడంలో ఈ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని, విశాఖ–విజయనగరం–శ్రీకాకుళం ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఎదిగే అవకాశాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. పోలవరం, అమరావతి, పోర్టులు, రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, విమానాశ్రయాల అభివృద్ధిని వేగవంతం చేస్తూ ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆగస్టు 1న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు ప్రజలు, యువత, రైతులు, మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బాలగ ప్రవీణ్, అప్పికొండ మోహన్, సత్య గణేష్, ఉమ్మిడి సుజాత, మటం శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
![]()