పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత గమ్యం.. పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత గమ్యం.. పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
ప్రజా ఆయుధం దినపత్రిక: హైదరాబాద్, జూలై 31: వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా నిలుస్తోందని, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తర భారత ప్రతినిధులతో ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థలోని బోధి పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని, మంచి ప్రతిపాదనలతో వచ్చే సంస్థలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్–500 కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్ ద్వారా ప్రస్తుతం దేశ జీడీపీలో 5 శాతంగా ఉన్న తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యమని వెల్లడించారు. హైదరాబాద్‌ను దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సర్వీస్, తయారీ, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అనుగుణంగా క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా ప్రణాళిక రూపొందించామని వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మాణం, పరిశ్రమలకు అవసరమైన భూములు, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం అనుమతులు లభించాయని, శంషాబాద్ నుంచి చెన్నై, పూణె, బెంగళూరు బుల్లెట్ రైలు మార్గాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. చైనా ప్లస్ వన్ వ్యూహంలో తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడి గమ్యంగా నిలపడం లక్ష్యమని, 2037 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కృత్రిమ మేధస్సు ప్రభావంతో ఉపాధి రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా మార్చామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే వందలాది గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయని, డేటా సెంటర్ల రంగంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సీఐఐ ఉత్తర భారత చైర్మన్ పునీత్ కౌరా, వైస్ చైర్మన్ శారదా సూరి మార్వా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ ఉత్తర భారత చైర్మన్ పునీత్ కౌరా మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, అందుకే ఈ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించామని తెలిపారు.
![]()