మండపేటలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
మండపేటలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
ప్రజా ఆయుధం దినపత్రిక: మండపేట, ఆగస్టు 1: మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. విద్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాల నివారణ, యువతకు కెరీర్ గైడెన్స్, డ్రగ్స్ నిర్మూలన, పోక్సో చట్టం వంటి కీలక అంశాలపై విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఆన్లైన్ మోసాలను ఎలా గుర్తించి నివారించాలి, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, బాలల రక్షణకు సంబంధించిన చట్టాల ప్రాముఖ్యత గురించి సూచనలు చేశారు. అలాగే విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని మండపేట టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి.వి. శ్రీనివాస్, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
![]()