ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం విక్రయాలు.. జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ వెల్లడి
ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం విక్రయాలు.. జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ వెల్లడి
ప్రజా ఆయుధం దినపత్రిక: రాజమహేంద్రవరం, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించేందుకు ఆగస్టు 1 నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ (ఎంఐపీ) అమలు చేయనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, తూకం పరికరాలు, ధరల బోర్డులు ఏర్పాటు చేసి నిరంతర సరఫరా ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
జిల్లాలోని గణేష్ చౌక్, ఆర్ట్స్ కాలేజీ, క్వారీ మార్కెట్, వీఎల్ పురం, నటరాజ్, లాలాచెరువు, శంభునగర్, మండపేట టౌన్ ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన రైస్ మిల్ అవుట్లెట్లలో కూడా ప్రత్యేక విక్రయ కేంద్రాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 6.85 లక్షల రైస్ కార్డు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయని తెలిపారు. ప్రతి రైస్ కార్డుకు 26 కిలోల బియ్యం అందజేయడం ద్వారా పేద, మధ్యతరగతి, కార్మిక కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.
జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతి మాట్లాడుతూ ఈ పథకం రైస్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. బియ్యం కొనుగోలు సమయంలో ఆధార్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం సూపర్ ఫైన్/స్టీమ్ బియ్యం కిలో రూ.52, రా రైస్ కిలో రూ.50కు విక్రయిస్తామని వెల్లడించారు.
నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నాసిరకం బియ్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి విక్రయ కేంద్రంలో బియ్యం రకాలు, ధరలు, పని వేళలు, ఫిర్యాదు వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. అలాగే రైతు బజార్లు, రైస్ మిల్ అవుట్లెట్లలో నిల్వలు, ధరలు, తూకాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు.
![]()