అమలాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ప్రారంభం
📰 ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ప్రారంభం
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 30: అమలాపురం సమీపంలోని పేరూరులో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యార్థుల రాకపోకల సౌకర్యార్థం అమలాపురం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. విన్నా నరసింహ స్వామి తెలిపారు.
ఉదయం అయినవిల్లి మండలంలోని విరవల్లిపాలెం, ఎస్. యానాం, ఆదుర్రు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరి నేరుగా కళాశాలకు చేరుకుంటాయని ఆయన వివరించారు. ఈ సౌకర్యాన్ని ఆయా ప్రాంతాల విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అలాగే రాజోలు నుంచి అమలాపురం వెళ్లే, అమలాపురం నుంచి రాజోలు వచ్చే ఆర్టీసీ బస్సులు పేరూరులో ఆగేందుకు కూడా ఆర్టీసీ అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై కొన్ని ప్రైవేట్ కళాశాలలు అసత్య ప్రచారం చేస్తున్నట్లు తల్లిదండ్రుల ద్వారా తమ దృష్టికి వచ్చినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కళాశాల ఎక్కడికీ తరలించబడదని, ప్రభుత్వ జి.ఓ. నెం. 64 ప్రకారం పేరూరులోనే శాశ్వతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజులు తక్కువగా ఉండటంతో పాటు, ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. కళాశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను దశలవారీగా కల్పిస్తున్నామని, ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించడంలో సహకరించిన స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అమలాపురం ఆర్టీసీ మేనేజర్, ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి ప్రిన్సిపాల్ డా. విన్నా నరసింహ స్వామి కృతజ్ఞతలు తెలిపారు.
![]()