కర్నూలు జిల్లా అభివృద్ధి, సాగునీరు, వలసల నివారణే లక్ష్యం: బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర
కర్నూలు జిల్లా అభివృద్ధి, సాగునీరు, వలసల నివారణే లక్ష్యం: బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర
ప్రజా ఆయుధం దినపత్రిక: కోసిగి, జూలై 29: బహుజన సేన సమితి జిల్లా సభల సన్నాహక యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలంలో బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, రైతులకు కరపత్రాలు పంపిణీ చేసి జిల్లా అభివృద్ధి కోసం పార్టీ చేపడుతున్న పోరాట కార్యాచరణను వివరించారు.
ఈ సందర్భంగా గడ్డం నాగేంద్ర మాట్లాడుతూ, 2014 విభజన హామీ చట్టం ప్రకారం కర్నూలు జిల్లాకు రావాల్సిన నిధులు, హక్కుల సాధన కోసం బహుజన సేన సమితి నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సాగునీరు అందుబాటులోకి వస్తే రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండదని, ఏడాదికి రెండు పంటలు సాగు చేసి సస్యశ్యామలంగా జీవించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి విద్యార్థుల డ్రాప్అవుట్లను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నాణ్యమైన వైద్య సేవలు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం బహుజన సేన సమితి చేపడుతున్న ప్రజా చైతన్య యాత్రకు రైతులు, యువకులు, ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సిద్ధరాముడు, వినోద్, మల్లి, రవి కుమార్, బెనకప్ప, ఎల్లయ్య, ఊరుకుంది, పార్టీ కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
![]()