టీజీ మోహన్‌దాస్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు: కామన ప్రభాకరరావు
టీజీ మోహన్‌దాస్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు: కామన ప్రభాకరరావు
మోహన్‌దాస్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్… సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి
ప్రజా ఆయుధం దినపత్రిక: మండపేట, జూలై 29: ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త టీజీ మోహన్‌దాస్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు ఆరోపించారు. బుధవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై టీజీ మోహన్‌దాస్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల ఆందోళనను ఉద్దేశించి పోలీసులు సమర్థంగా నియంత్రించలేదని, తాను అక్కడ ఉంటే కర్ఫ్యూ విధించి కాల్పులు జరిపేవాడినని టీజీ ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం నిరంకుశ ధోరణికి నిదర్శనమని అన్నారు. అలాగే మహిళలపై చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండించదగ్గవని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు విద్యార్థుల్లో మరింత ఆగ్రహాన్ని, ఉద్యమ స్ఫూర్తిని పెంచే ప్రమాదం ఉందని అన్నారు. టీజీ మోహన్‌దాస్‌పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, అవసరమైతే సుప్రీంకోర్టు సుమోటోగా ఈ వ్యవహారాన్ని స్వీకరించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందా లేక నియంతృత్వ ధోరణులు పెరుగుతున్నాయా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ, ఉద్యమకారులపై హింసను ప్రేరేపించేలా వ్యవహరించిన వారిపై నిష్పాక్షిక విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కామన ప్రభాకరరావు డిమాండ్ చేశారు.
![]()