22-ఏ నిషేధిత భూములు, రీ సర్వే పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలి: కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్
22-ఏ నిషేధిత భూములు, రీ సర్వే పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలి: కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్
అమలాపురం, జూలై 28: నిషేధిత భూములు (22-ఏ) జాబితా సవరణ, భూ రీ-సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, ఈ-కేవైసీ నమోదు, మ్యూటేషన్ల ప్రక్రియలను పక్కా ప్రణాళికతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జి. జయలక్ష్మి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 22-ఏ నిషేధిత భూములు, రీ-సర్వే పనులు, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, ఈ-కేవైసీ నమోదు, మ్యూటేషన్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమాన్ని లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, రోజువారీ సమీక్షలు నిర్వహిస్తూ రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఆర్డీవోలు తమ పరిధిలోని రీ-సర్వే పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణయించిన లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి, జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు, డిప్యూటీ కలెక్టర్ కె. అచ్యుతాకుమారి, కొత్తపేట, రామచంద్రపురం ఆర్డీవోలు జి. సత్యనారాయణ, సరళావతి, జిల్లా సర్వే శాఖ అధికారి కె. ప్రభాకర్, జిల్లా పరిపాలన అధికారి కె. నాగలక్ష్మి, ఉప తహశీల్దార్లు, రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.
![]()