డీఎస్సీ అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలి: పాముల రాజేశ్వరి దేవి
డీఎస్సీ అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలి: పాముల రాజేశ్వరి దేవి
రాజోలు, జూలై 28: డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన భృతి వెంటనే అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజోలు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పాముల రాజేశ్వరి దేవి డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా మంగళవారం గెద్దాడ గ్రామంలో జాతీయ రహదారి-216పై పార్టీ జెండా ఊపి మోటార్‌సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై స్వతంత్ర న్యాయ విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయడంతో పాటు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![]()