దైనందిన జీవితంలో యోగా, ధ్యానం భాగం కావాలి: మంత్రి కందుల దుర్గేష్
దైనందిన జీవితంలో యోగా, ధ్యానం భాగం కావాలి: మంత్రి కందుల దుర్గేష్
కొత్తపేట, జూలై 28: దైనందిన జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను జయించి ప్రశాంతమైన జీవనం గడపాలంటే యోగా, ధ్యానం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం రాజవరం (పేరవరం)లోని శ్రీ వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రాన్ని మంత్రి మంగళవారం సందర్శించి, పరమహంస యోగానందుల వారి శ్రీ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపౌర్ణమి మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నతనం నుంచే యోగా, ధ్యానంపై దృష్టి సారిస్తే ఏ రంగంలోనైనా ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో భాగమైన యోగా, ధ్యాన విద్యలను పునరుద్ధరించడం ద్వారా సమాజ శ్రేయస్సు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గోదావరి నది, ప్రకృతి రమణీయతల నడుమ ఏర్పాటైన రాజవరం పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కలిగిన ప్రదేశమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక, యోగా, ఆయుర్వేద, వెల్నెస్ కేంద్రాలపై గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని మంత్రి తెలిపారు. గోదావరి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ వాటర్ స్పోర్ట్స్, రాజవరం పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం, ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయం, కోనసీమ ప్రకృతి అందాలు, సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాలను అనుసంధానిస్తూ కోనసీమ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు కోసం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు సాధించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు అమలుతో కోనసీమకు దేశ, విదేశీ పర్యాటకుల రాక పెరిగి స్థానికంగా ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతియుత, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బ్రహ్మర్షి పితామహ పత్రీజీ అందించిన ధ్యాన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి సూచించారు. ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీ వశిష్ట గౌతమి పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ నిర్వాహకులను మంత్రి అభినందించారు.
![]()