కామనగరువులో ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఆనందరావు… సమస్య చెప్పగానే రోడ్డు మంజూరుకు ఆదేశాలు
కామనగరువులో ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఆనందరావు… సమస్య చెప్పగానే రోడ్డు మంజూరుకు ఆదేశాలు
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 28: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమం రెండో రోజు అమలాపురం నియోజకవర్గంలోని కామనగరువు గ్రామంలో ఉత్సాహంగా సాగింది. స్థానిక శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ వీధికి రోడ్డు సౌకర్యం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే స్పందించి పంచాయతీ కార్యదర్శిని అక్కడికక్కడే పిలిపించి సమస్యను పరిశీలించారు. వెంటనే రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే చూపిన తక్షణ స్పందనకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, మత్స్యకార వికాసం వంటి పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని మైటీడీపీ యాప్లో నమోదు చేయించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు వనమాడి సునీత, కూటమి పార్టీల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జీలు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]()