ఇరిగేషన్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ…
సాగునీటిపై నిరాధార ఆరోపణలు సరికావు…
ఇరిగేషన్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ…
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 28: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఇరిగేషన్ సమీక్ష సమావేశంలో పి. గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ రైతులకు సాగునీరు అందలేదని చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే స్పందిస్తూ, వాస్తవాలను తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. పి. గన్నవరం నియోజకవర్గంలో రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి పెద్ద సమస్యలు లేవని, కొన్ని ప్రాంతాల్లో కేవలం పది రోజులపాటు మాత్రమే నాట్లు ఆలస్యమైన విషయం తప్ప మిగతా ప్రాంతాలన్నింటిలో రైతులు సాధారణంగా సాగు పనులు పూర్తిచేశారని తెలిపారు. దీనిని రైతులే సమావేశంలో ధృవీకరించారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలువల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఇరిగేషన్ వ్యవస్థ దెబ్బతిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నీటి సంఘాలను ఏర్పాటు చేసి రైతుల సమస్యలను గుర్తిస్తూ అవసరమైన పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోందన్నారు. కాలువల పూడికతీత, సైడ్వాల్ల మరమ్మతులు, సాగునీటి పంపిణీకి అవసరమైన పనులు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని, రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే విమర్శలను కూటమి ప్రభుత్వం సహించబోదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
![]()