డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి: జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్
డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి: జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 28: డీఎస్సీ నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అమలాపురంలో డీఎస్సీ అక్రమాలకు నిరసనగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నైతిక బాధ్యతకు సంబంధించిన అనేక ఉదాహరణలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం అదే ప్రమాణాలు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. సుమారు 3.5 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించి నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని క్షమించదని హెచ్చరించారు. అనంతరం అమలాపురం కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని డీఎస్సీ అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
![]()