పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి: నారా భువనేశ్వరి
పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి: నారా భువనేశ్వరి
ప్రజా ఆయుధం దినపత్రిక: కుప్పం, జూలై 28: చిత్తూరు జిల్లా కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హెరిటేజ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమై వారు ప్రదర్శించిన క్రీడా ప్రతిభను వీక్షించారు. అనంతరం నిర్వహించిన క్విజ్ పోటీల్లో పాల్గొని విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, పోటీ పరీక్షల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను అలవర్చుతాయని చెప్పారు. క్విజ్ వంటి మేధోపరమైన కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని, విశ్లేషణాత్మక దృక్పథాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, అపజయాలను చూసి నిరుత్సాహపడకుండా వాటిని విజయానికి మెట్టుగా మలుచుకోవాలని సూచించారు. విద్యతో పాటు మంచి విలువలు, సామాజిక బాధ్యత, సేవా దృక్పథాన్ని అలవర్చుకుంటేనే ఉన్నత వ్యక్తిత్వం ఏర్పడుతుందని తెలిపారు.
విద్యార్థులతో ప్రశ్నోత్తర కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి వారి సందేహాలకు సమాధానాలు ఇస్తూ ప్రోత్సహించారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి, విద్యా సంస్థ యాజమాన్యం, అధ్యాపకులు విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేలా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]()