మస్కట్‌లో చిక్కుకున్న మహిళకు ఊరట.. జిల్లా యంత్రాంగం చొరవతో సురక్షితంగా స్వదేశానికి రాక
మస్కట్‌లో చిక్కుకున్న మహిళకు ఊరట.. జిల్లా యంత్రాంగం చొరవతో సురక్షితంగా స్వదేశానికి రాక
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 28: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం రంగాపురం సమనస గ్రామానికి చెందిన చుట్టుగుల్ల వెంకటలక్ష్మి మస్కట్‌లో ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందుల నుంచి జిల్లా యంత్రాంగం చొరవతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ సమన్వయంతో ఆమెను భారతదేశానికి రప్పించారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2025 నవంబరులో ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లిన వెంకటలక్ష్మికి అక్కడ సరైన ఉద్యోగం లభించక రెండు నెలల పాటు ఏజెంట్ కార్యాలయంలోనే ఉంచారు. అనంతరం ఒక కుటుంబంలో గృహ కార్మికురాలిగా పనికి పంపగా, తొమ్మిది మంది పిల్లల సంరక్షణతో పాటు ఇంటి పనులన్నీ చేయాల్సి వచ్చింది. యజమాని కుటుంబం నుంచి శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొన్న ఆమెను తిరిగి ఏజెంట్ కార్యాలయానికి తీసుకెళ్లి, నాలుగు లక్షల రూపాయలు చెల్లిస్తేనే భారత్‌కు పంపిస్తామని చెప్పినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె భర్త సూర్యనారాయణ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌కు ఫిర్యాదు పంపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత ఏజెంట్‌తో నిరంతర సంప్రదింపులు జరిపి, కుటుంబ సభ్యుల సహకారంతో వెంకటలక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారి వి. సుబ్బారావు, సమన్వయకర్త గోళ్ళ రమేష్ తెలిపారు. స్వదేశానికి చేరుకున్న అనంతరం వెంకటలక్ష్మి, ఆమె భర్త సూర్యనారాయణ జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం, కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియాల సత్తిబాబు, షేక్ బీబి సఫియా తదితరులు పాల్గొన్నారు.
![]()