చేనేత సహకార సంఘాలకు రూ.6.36 కోట్ల క్యాష్ క్రెడిట్ ప్రతిపాదనలు : ఆర్. మహేష్ కుమార్ కలెక్టర్
చేనేత సహకార సంఘాలకు రూ.6.36 కోట్ల క్యాష్ క్రెడిట్ ప్రతిపాదనలు : ఆర్. మహేష్ కుమార్ కలెక్టర్
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 28: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ పరిమితుల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో చేనేత సహకార సంఘాల ఆర్థిక పరిస్థితి, నాబార్డ్ నిబంధనల మేరకు క్యాష్ క్రెడిట్ పునరుద్ధరణ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 16 చేనేత సహకార సంఘాలు ఉండగా, వాటిలో మూడు సంఘాలు సుప్తచేతన స్థితిలో ఉన్నాయని, మరో మూడు సంఘాలు స్వంత నిధులతో లేదా నాబార్డ్ నిబంధనలకు అతీతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అధికారులు వివరించారు. నాబార్డ్ నిబంధనలకు అనుగుణంగా అర్హత సాధించిన 10 చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ పరిమితుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సంఘాలకు కలిపి రూ.6 కోట్ల 36 లక్షల 17 వేల క్యాష్ క్రెడిట్ పరిమితి పునరుద్ధరణ కోసం కోఆపరేటివ్ బ్యాంకులు, ఆప్కాబ్ ద్వారా నాబార్డ్‌కు ప్రతిపాదనలు పంపుతున్నట్లు వెల్లడించారు. క్యాష్ క్రెడిట్‌కు అర్హత పొందిన సంఘాల్లో హసన్‌బాద, శివకోడు, కే. జగన్నాథపురం, మామిడికుదురు, అద్దంపల్లి (మల్లేశ్వర), పెనుమల్లి, బండార్లంక, రంగాపురం (రామలింగేశ్వర), మోరి, శివబాలయోగి ఆదివారపుపేట చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. సమావేశంలో జిల్లా సహకార అధికారి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ (రాజమండ్రి), అమలాపురం ఏడీ శ్రీనివాసరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.