అనేం సాయి హత్య కేసులో ప్రత్యేక బృందంతో సమగ్ర విచారణ చేపట్టాలి: మంద కృష్ణ మాదిగ
📰 ప్రజా ఆయుధం దినపత్రిక
అనేం సాయి హత్య కేసులో ప్రత్యేక బృందంతో సమగ్ర విచారణ చేపట్టాలి: మంద కృష్ణ మాదిగ
ప్రజా ఆయుధం దినపత్రిక: రావులపాలెం, జూలై 24: రావులపాలెంలో ఇటీవల హత్యకు గురైన అనేం సాయి కేసులో ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ సాయి హత్య ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ హత్య కేసులో ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. దోషులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
![]()