ముద్రగడ పద్మనాభం ఆశయాలు చిరస్మరణీయం.. సంతాప సభలో ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి
📰 ప్రజా ఆయుధం దినపత్రిక
ముద్రగడ పద్మనాభం ఆశయాలు చిరస్మరణీయం.. సంతాప సభలో ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 26: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాధుర్ బాలయోగి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి, అల్లాడి స్వామినాయుడు, గంధం పల్లంరాజు, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాస్, నల్లా విష్ణు, కల్వకులను తాతాజీ, చల్లా ప్రభాకర్‌రావుతో కలిసి రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో నీతి, నిజాయితీ, విలువలకు ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. స్వార్థ రాజకీయాలకు దూరంగా ప్రజా ప్రయోజనాల కోసం, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమ నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ, 1994లో రావులపాలెంలో కాపులకు రిజర్వేషన్లు కోరుతూ జరిగిన ఉద్యమంలో కాపులపై లాఠీచార్జీ జరిగినప్పుడు అప్పటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత నాయకుడు ముద్రగడ పద్మనాభమని గుర్తు చేశారు. ఉద్యమ లక్ష్యం నెరవేరకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన త్యాగమూర్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఆ ఉద్యమ ఫలితంగానే జీవో-30 సాధ్యమైందని పేర్కొన్నారు.
2016లో కాపు జేఏసీ నాయకులతో కలిసి మరోసారి ఉద్యమాన్ని చేపట్టి కాపు కార్పొరేషన్ ఏర్పాటు, కాపు విద్యార్థులకు విదేశీ విద్య, కాపు భవనాల నిర్మాణం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, బీసీ-ఎఫ్ రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్ వంటి పలు కీలక అంశాల సాధనలో ముద్రగడ కీలక పాత్ర పోషించారని వివరించారు. కాపు కార్పొరేషన్ ద్వారా వేలాది మంది యువత, విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
1977లో జనతా పార్టీ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ముద్రగడ పద్మనాభం రాజీపడని నాయకుడని, ఆశయాల కోసం చివరి వరకు పోరాడిన ఉద్యమ యోధుడని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ, ఎక్సైజ్, సివిల్ సప్లై శాఖల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆయన విశేష కృషి చేశారని గుర్తు చేశారు.
ముద్రగడ పద్మనాభం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కాపు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆయనను విమర్శించకుండా, ఆయన చేసిన సేవలను గుర్తుంచుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నల్ల పవన్, సూధా గణపతి, చిక్కాల గణేష్, తాడాల సుబ్రహ్మణ్యం (పండు), చోడపనీది భాస్కర్‌రావు, అంబటి సాగర్, నల్లా అజయ్, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, అయితాబత్తుల సుభాషిణి, నల్ల సంజీవ్, గంగుమల్ల కాశీ అన్నపూర్ణ శ్రీనువాస్ ,కాపు జేఏసీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]()