అధికారుల పనితీరుకు గీటురాయి: జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
అర్జీల పరిష్కారంలో నాణ్యతకు పెద్దపీట.. అర్జీదారుల సంతృప్తే అధికారుల పనితీరుకు గీటురాయి: జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
-
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూన్ 29: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతకు పెద్దపీట వేస్తూ, జవాబుదారీతనంతో ప్రతి అర్జీని నూటికి నూరు శాతం అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి, డీఆర్వో వి. సుబ్బారావు, ఎస్డీసీ అచ్చుత కుమారి కలిసి సుమారు 220 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదన్నారు. ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు అసలైన గీటురాయని, సేవల నాణ్యతే సుపరిపాలనకు సరైన ప్రమాణమని స్పష్టం చేశారు. ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకసారి పరిష్కరించిన సమస్య మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రజా స్నేహపూర్వకంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అర్జీల పరిష్కారం అనంతరం సంబంధిత అధికారులు స్వయంగా అర్జీదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి మాట్లాడుతూ పీజీఆర్ఎస్తో పాటు ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు సాఫ్ట్ స్కిల్స్‌ను అలవర్చుకోవడంతో పాటు అర్జీదారులతో మర్యాదపూర్వకంగా, సౌమ్యంగా వ్యవహరించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాస్తవ పరిస్థితులను తెలుసుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా పనిచేయాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ప్రతి అధికారి జవాబుదారీతనం, నిబద్ధతతో పనిచేయాలని, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా సేవలు అందించడం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి అర్జీని నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
![]()