మా భూమిని మాకు ఇప్పించండి మహాప్రభో రెవెన్యూ అధికారులను వేడుకుంటున్న పోలిశెట్టి వెంకటేశ్వరరావు
ప్రజా ఆయుధం దినపత్రిక
మా భూమిని మాకు ఇప్పించండి మహాప్రభో
రెవెన్యూ అధికారులను వేడుకుంటున్న పోలిశెట్టి వెంకటేశ్వరరావు
ప్రజా ఆయుధం, ముమ్మిడివరం, జూన్ 13:
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లవారిపాలెం గ్రామానికి చెందిన పోలిశెట్టి వెంకటేశ్వరరావు తమ భూమిని తమకు ఇప్పించాలని కోరుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితిని పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం, అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం గ్రామ శివారు బుచ్చియ్యపేట వద్ద సర్వే నంబర్ 222/2లో ఉన్న 2 ఎకరాల 86 సెంట్ల భూమిని పోలిశెట్టి వెంకటేశ్వరరావుతో పాటు మరో 18 మంది కలిసి 2016 అక్టోబర్ 28న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించి భూమికి సంబంధించి సర్వే నిర్వహించాలని కోరగా, కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు పంపినట్లు తెలిపారు. అయితే తహసీల్దార్ కార్యాలయం నుంచి సబ్‌డివిజన్ జరగలేదని పేర్కొంటూ సర్వే నిర్వహించలేమని సెప్టెంబర్ 9, 2024న ఎండార్స్మెంట్ ఇచ్చి జిల్లా సర్వేయర్‌ను సంప్రదించాలని సూచించినట్లు చెప్పారు.
మూడేళ్లుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఆర్డీవో, తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి, 2 ఎకరాల 86 సెంట్ల భూమిలో కేవలం 1 ఎకరం 40 సెంట్లు మాత్రమే ఉన్నట్లు నివేదిక రూపొందించారని ఆరోపించారు.
అలాగే సర్వే నంబర్ 222/2లో తమ రిజిస్ట్రేషన్ అనంతరం 1-బి పాస్‌బుక్ ఆధారంగా ఫోర్జరీ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. లక్కీ రాజు చిరంజీవి తండ్రి మాణిక్యం, పందిరి రఘురాం తండ్రి సూర్యనారాయణ పేర్లతో ఫోర్జరీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ దస్తావేజులు, తహసీల్దార్, ఆర్డీవో, సర్వేయర్ కార్యాలయాల నుంచి పొందిన ఎండార్స్మెంట్ కాపీలు తదితర ఆధారాలను అధికారులకు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
కావున తమ భూమికి సంబంధించిన ఫోర్జరీ రిజిస్ట్రేషన్లపై సమగ్ర న్యాయ విచారణ జరిపి, తమ భూమిని తమకు అప్పగించాలని పోలిశెట్టి వెంకటేశ్వరరావుతో పాటు మరో 18 మంది బాధితులు ప్రభుత్వాన్ని, రెవెన్యూ అధికారులను పత్రికా ప్రకటన ద్వారా కోరారు.
ప్రతి అక్షరం ప్రజా ఆయుధం
అధికారిక వాట్సాప్ ఛానల్:
https://whatsapp.com/channel/0029VaAedz6BadmYaSWz3B12
ప్రజా ఆయుధం వాట్సాప్ గ్రూప్:
https://chat.whatsapp.com/BrX1qBJm2QA4o159Xg1NM9?mode=gi_t
![]()