రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు
ప్రజా ఆయుధం దినపత్రిక
కొబ్బరి ఆధారిత రంగ కార్మికులు “సురక్ష బీమా” పథకాన్ని వినియోగించుకోవాలి
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు
ప్రజా ఆయుధం రామచంద్రపురం, మే 9, 2026:
కొబ్బరి ఆధారిత పరిశ్రమలు మరియు అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న “సురక్ష బీమా పథకం” ఎంతో ఉపయోగకరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
కొబ్బరి చెట్లు ఎక్కే కార్మికులు, తోటల్లో పనిచేసే కూలీలు, కొబ్బరి పీచు, టెంకాయ, ఫైబర్ ఆధారిత యూనిట్లలో పనిచేసే వారు తప్పనిసరిగా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
మంత్రి మాట్లాడుతూ, తాటి మరియు కొబ్బరి చెట్లపైకి ఎక్కే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భాల్లో కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ బీమా పథకం ఉపయోగపడుతుందన్నారు.
అసంఘటిత రంగ కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల కార్మికులు ఈ పథకానికి అర్హులని తెలిపారు.
చేతి వృత్తులు చేసేవారు, చిన్న వ్యాపారులు, నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కొబ్బరి ఆధారిత రంగాల్లో పనిచేసే వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు.
ఈ పథకం కింద ప్రమాద మరణం సంభవించినపుడు రూ.7 లక్షల వరకు బీమా సౌకర్యం అందిస్తారని, సహజ మరణం జరిగినా ఆర్థిక సహాయం లభిస్తుందని మంత్రి వివరించారు.
నెలకు సుమారు రూ.950 ప్రీమియంగా ఉండగా, ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వాటా భరిస్తాయని, కార్మికుడు కేవలం రూ.43 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు.
అర్హత కలిగిన కార్మికులు వెంటనే నమోదు చేసుకుని ఈ పథకం ప్రయోజనాలను పొందాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. పూర్తి వివరాలకు స్థానిక కార్మిక శాఖ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.
![]()