ఉడిముడి లంకలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
ప్రజా ఆయుధం దినపత్రిక
ఉడిముడి లంకలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
ప్రజా ఆయుధం పి. గన్నవరం, మే 9, 2026:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఉడిముడి లంక గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. చదువుకునే రోజుల్లో ఎన్నో అవమానాలు, అంటరానితనాన్ని ఎదుర్కొన్నప్పటికీ అంబేద్కర్ వెనుకడుగు వేయకుండా ఉన్నత విద్యలను అభ్యసించి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారని తెలిపారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించడం ఆయన చేసిన మహోన్నత సేవ అని కొనియాడారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తే అదే అంబేద్కర్ ఆశయాలకు నిజమైన నివాళి అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చదువు ద్వారానే వ్యక్తి గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయికి ఎదగగలడని అంబేద్కర్ చూపించిన మార్గాన్ని గుర్తు చేశారు.
ఉడిముడి లంక తన స్వగ్రామం కావడంతో గ్రామ ప్రజలతో ఎంతో ఆప్యాయంగా మమేకమయ్యారు. ఈ జయంతి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. గ్రామ ప్రజలకు ఎప్పుడైనా అవసరం వచ్చినా ముందుండి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]()