మేడే స్ఫూర్తిని కొనసాగిస్తాం: సిపిఎం ప్రజా ఆయుధం నాగర్ కర్నూల్, మే 01 :
మేడే స్ఫూర్తిని కొనసాగిస్తాం: సిపిఎం
ప్రజా ఆయుధం నాగర్ కర్నూల్, మే 01 :
మేడే స్ఫూర్తిని కొనసాగిస్తూ కార్మిక హక్కుల కోసం భవిష్యత్లో పోరాటాలు కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు గుంపల్లి అశోక్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో మేడే సందర్భంగా ఎర్రజెండాను ఎగరేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల రక్త తర్పణంతో పుట్టిన ఎర్రజెండా కార్మికుల హక్కుల సంకేతమని పేర్కొన్నారు. ఎప్పటికీ ఎర్రజెండా కూలీలు, కర్షకుల సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని, పని గంటల పెంపు నిర్ణయం దుర్మార్గమని విమర్శించారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు సాగుతున్నాయని ఆరోపించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు, ఐకేపీ వీవోఏలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలతో కుటుంబాలు నెట్టుకొస్తున్న పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మేడే స్ఫూర్తిని కొనసాగిస్తూ కార్మికుల ఐక్య ఉద్యమాలకు నాంది పలుకుతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సుధాకర్ జెండా ఆవిష్కరించగా, వెంకటేష్, జస్వంత్, జయమ్మ, రాములు, పార్వతమ్మ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
![]()