పదో తరగతిలో పవిత్ర 598 మార్కులు – రాష్ట్రంలో ద్వితీయ స్థానం ప్రజా ఆయుధం దినపత్రిక
పదో తరగతిలో పవిత్ర 598 మార్కులు – రాష్ట్రంలో ద్వితీయ స్థానం
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
కష్టాలను జయిస్తూ చదువులో అద్భుత ప్రతిభ కనబరిచిన పెయ్యిల పవిత్ర పదో తరగతి పరీక్షల్లో 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రథమ స్థానం సాధించింది.
ఆలమూరు మండలం చింతలూరు ఎస్సీ కాలనీకి చెందిన పవిత్ర చిన్నప్పుడే తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా తల్లి వద్ద పెరిగింది. తల్లి మాధవి నర్సింగ్ చదివి రాజమహేంద్రవరం నర్సింగ్ కాలేజీలో ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ కుమార్తెను చదివించారు.
చదువు విలువను అర్థం చేసుకున్న పవిత్ర మొదట ఆలమూరు సిద్ధార్థ స్కూల్లో చదివి, అనంతరం తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్లో నాలుగో తరగతి నుంచి విద్యను కొనసాగించింది. తల్లి కష్టాన్ని గుర్తించి చదువుపై పూర్తిగా దృష్టి సారించి ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పదో తరగతితో పాటు జాతీయ స్థాయి పరీక్షల్లోనూ పవిత్ర సత్తా చాటింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించే ‘శ్రేష్ట (SHRESHTA)’ ప్రవేశ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 255వ ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకుతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలల్లో ఉచిత విద్యను అభ్యసించే అవకాశం లభించనుంది.
ఇంటర్మీడియట్లో బైపిసి తీసుకుని డాక్టర్ అవ్వడం తన లక్ష్యమని పవిత్ర తెలిపింది.
![]()