పామర్రు నియోజకవర్గంలో మే డే వేడుకలు – కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం చంద్రబాబు నాయుడు
పామర్రు నియోజకవర్గంలో మే డే వేడుకలు – కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం చంద్రబాబు నాయుడు
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం కృష్ణ జిల్లా, మచిలీపట్నం, మే 1:
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలిచిందని, పార్టీ జెండాలో నాగలి, ఇల్లు, చక్రం చిహ్నాలు కార్మిక, కర్షక వర్గాల ప్రాధాన్యాన్ని సూచిస్తాయని అన్నారు.
గత ప్రభుత్వ కాలంలో పరిశ్రమలు, పెట్టుబడులు తగ్గిపోయాయని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయని తెలిపారు. అమరావతి నిర్మాణం, పరిశ్రమల స్థాపన ద్వారా నిర్మాణ రంగ కార్మికులకు విస్తృత ఉపాధి లభిస్తోందని చెప్పారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి గతంలో నిలిపివేయబడిన పథకాలను పునరుద్ధరించి అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ సెంటర్లను పైలట్ ప్రాజెక్ట్‌గా ఐదు నగరాల్లో ప్రారంభించి, ప్రస్తుతం 15 నగరాలకు విస్తరింపజేస్తున్నామని పేర్కొన్నారు.
కార్మికుల నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేపడుతున్నామని తెలిపారు. రెండు సంవత్సరాల్లోనే ఏడు ఈఎస్ఐ ఆసుపత్రులు, 55 డిస్పెన్సరీలకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు.
కార్మికులు బలపడితే రాష్ట్రం బలపడుతుందని, సంక్షేమం, నైపుణ్యం, ఉపాధి, ఆరోగ్యం అనే నాలుగు స్తంభాలపై కార్మిక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ సెంటర్ మోడల్‌ను పరిశీలించి అధికారులను అభినందించారు. అనంతరం శ్రమశక్తి పురస్కార గ్రహీతలకు సత్కారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి ఎం.వి. శేషగిరిరావు, సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, శ్రమశక్తి పురస్కార గ్రహీతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
![]()