మే డే వేడుకల్లో కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది – ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
మే డే వేడుకల్లో కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది – ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
కార్మికుల రక్షణ, శ్రేయస్సు కోసం కార్మికులు నినదించిన రోజే మే డే అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మే డే సందర్భంగా రావులపాలెం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకల్లో ఆయనతో పాటు కొత్తపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి భీమవరం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కార్మికుల, కర్షకుల శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో సుమారు 88 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని, వారి సంక్షేమం కోసం రూ.615 కోట్లతో పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆకలి రహిత సమాజం కోసం అన్న క్యాంటీన్లు, సామాజిక భద్రతా పింఛన్లు, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు కార్మికుల జీవితాల్లో అభ్యున్నతి నింపుతున్నాయని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కార్మికుల సంక్షేమ పథకాలు నిలిపివేయబడ్డాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని మళ్లీ అమలు చేస్తోందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమల స్థాపన ద్వారా కార్మికులకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. త్వరలో లాజిస్టిక్స్ కంపెనీలు కూడా రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు.
కార్మికుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సుమారు 25 వేల మంది కార్మికులు ఇప్పటికే శిక్షణ పొందుతున్నారని వివరించారు. రావులపాలెంలో త్వరలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కార్మికులు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
![]()