డాక్టర్ “కోనసీమ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అద్భుత ప్రతిభ – రాష్ట్రంలో రెండో స్థానం సాధించిన జిల్లా: కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
డాక్టర్ “కోనసీమ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అద్భుత ప్రతిభ – రాష్ట్రంలో రెండో స్థానం సాధించిన జిల్లా: కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
విద్యార్థినీ విద్యార్థులు క్రమశిక్షణ, ఏకాగ్రతతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ పదవ తరగతి పరీక్ష ఫలితాల ద్వారా నిరూపించి కోనసీమ జిల్లాను రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిపారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన ఐదు మంది విద్యార్థులను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సంయుక్తంగా అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారని తెలిపారు. పరిమిత వనరుల మధ్య కూడా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ర్యాంకులు సాధించడం విద్యార్థుల పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు టాపర్లుగా నిలవడం గర్వకారణమని అన్నారు.
విద్యార్థుల కృషికి తోడు ఉపాధ్యాయుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ముఖ్యమని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు.
డీఈవో పి. నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 241 ప్రభుత్వ పాఠశాలల్లో 94 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయని, 145 పాఠశాలలు 61.99% ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. రెండు పాఠశాలలు మాత్రమే 60% లోపు ఫలితాలు సాధించాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలలో ఎస్.ఆర్.ఎల్ నిహారిక 596 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించగా, ఎన్. కృతిక, జి.హెచ్ సత్యదుర్గ 595 మార్కులు, సి.హెచ్ జ్యోతి శ్రీ, కె. అభిశ్రీ 593 మార్కులు సాధించారు. వీరిని అధికారులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి జి. సూర్యప్రకాశం, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
![]()