కాలువల మూసివేత సమయంలో జలధార కార్యక్రమాలతో భూగర్భ జలాలు పెంచాలి: జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
కాలువల మూసివేత సమయంలో జలధార కార్యక్రమాలతో భూగర్భ జలాలు పెంచాలి: జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
రాష్ట్ర ప్రభుత్వం కాలువల మూసివేత సమయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించే పనులను విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లో జల వనరులు, డ్రైనేజీ, దేవాదాయ ధర్మాదాయ, ఆర్డబ్ల్యూఎస్ విభాగాలతో జలధార కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు తక్కువగా ఉన్న 45 గ్రామాల్లో కాలువలు, చెరువులు, రీఛార్జ్ కుంటల అభివృద్ధి పనులను ఉపాధి హామీ పథకం అనుసంధానంతో వేగవంతం చేయాలని ఆదేశించారు. నీటి సంఘాల భాగస్వామ్యంతో ఈ పనులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
అలాగే దేవాలయాల్లోని కోనేరుల అభివృద్ధికి సంబంధించి జల వనరుల శాఖ రూపొందించిన అంచనాలను సమగ్రంగా సమర్పించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కోనేరు అభివృద్ధికి రూ.60 లక్షలు, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కోనేరు అభివృద్ధికి రూ.6 కోట్లు, ద్రాక్షారామం ఆలయ కోనేరు రూ.44 లక్షలు, కోటిపల్లి కోనేరు రూ.1 కోటి అంచనాలు రూపొందించినట్లు తెలిపారు.
పలివెల ఆలయంలో ప్రస్తుతం ఉన్న కోనేరు పల్లపు ప్రాంతంలో ఉండటంతో ప్రత్యామ్నాయ కోనేరు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉప్పలగుప్తం మండలంలో మైనర్ డ్రైన్లు, గోరగన్ ముడి డ్రైన్ల వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
వర్షపు నీటిని సంరక్షించడం, చెరువుల పునరుద్ధరణ, కాలువల పూడికతీత పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జలధార కార్యక్రమం ప్రభుత్వానికే పరిమితం కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని కోరారు.
పెండింగ్లో ఉన్న జలవనరుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జల వనరులు, డ్రైనేజీ విభాగం ఈఈలు వెంకటేశ్వరరావు, ఎం.వి. కిషోర్, డ్వామా పీడీ డి. రాంబాబు, తహసీల్దార్లు, దేవాదాయ శాఖ ఈఓలు భవాని తదితరులు పాల్గొన్నారు.
![]()