భూమి తేమ సంరక్షణకు పీఎండీఎస్ సాగు కీలకం – రైతులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్
భూమి తేమ సంరక్షణకు పీఎండీఎస్ సాగు కీలకం – రైతులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 01: ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భూముల్లో తేమను కాపాడుకుని భూసారాన్ని పెంచుకోవడానికి డైరెక్ట్ మాన్సూన్ డ్రై షోయింగ్ (PMDS) సాగు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో పీఎండీఎస్ సాగు కిట్ల పంపిణీ మరియు సాగు విస్తీర్ణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పీఎండీఎస్ సాగు లక్ష్యాలను సాధించేందుకు వ్యవసాయ, ఉద్యాన, కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్, డీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రబీ వరి కోతల అనంతరం భూములను ఖాళీగా ఉంచకుండా నవధాన్యాల సాగు చేపట్టడం వల్ల భూసార పరిరక్షణతో పాటు రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం సూచించిన మేరకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) పద్ధతిలో నవధాన్యాల సాగును ప్రోత్సహించాలని సూచించారు.
మండలాల వారీగా రైతు సేవా కేంద్రాల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేస్తూ విత్తన కిట్ల పంపిణీ చేయాలని ఆదేశించారు. 15 రకాల నవధాన్యాలను మూడు రోజుల్లో సేకరించి, రైతులకు వెంటనే పంపిణీ చేయాలని సూచించారు.
నవధాన్యాల సాగు వల్ల యూరియా వాడకం తగ్గుతుందని, పప్పుధాన్యాల మొక్కలు గాలిలోని నత్రజనిని గ్రహించి భూమిలో నిక్షిప్తం చేయడం ద్వారా భూసారాన్ని పెంచుతాయని ఆయన తెలిపారు. వరి కోతల తర్వాత భూమిని కప్పి ఉంచడం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి మరింత సారవంతమవుతుందని పేర్కొన్నారు.
పీఎండీఎస్ పద్ధతిలో పొడి వాతావరణంలో విత్తనాలు నాటడం వల్ల గాలిలోని తేమను ఉపయోగించి మొక్కలు బాగా పెరుగుతాయని, ఎల్ నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
నవధాన్యాల ద్వారా రైతులకు ఆహార ధాన్యాలతో పాటు పశువులకు పోషక విలువలున్న మేత కూడా లభిస్తుందని చెప్పారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.వి. రామారావు, డీఆర్డీఏ పీడీ డి. రాంబాబు, ఏపీ సీఐఎఫ్ అదనపు డీపీఎం సత్యనారాయణ, డీపీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
![]()