అమలాపురంలో విలువిద్య సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభం – యువతకు క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరం: జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
అమలాపురంలో విలువిద్య సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభం – యువతకు క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరం: జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 01:
యువతకు క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణ, ఏకాగ్రతకు నిలువుటద్దంలా పనిచేస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు.
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా ఉన్న అమలాపురం ‘ది అమలాపురం కాలేజ్’లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సాయి విలువిద్య సంస్థ ద్వారా విలువిద్య సమ్మర్ కోచింగ్ క్యాంపు 2026ను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువిద్యలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే దిశగా శాప్ వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. గ్రామీణ, పట్టణ యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ‘నవశకం’ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు.
జిల్లాలోని యువతలో విలువిద్యలో అపారమైన ప్రతిభ ఉందని, ఈ ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సహజ ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారికి సరైన వేదిక కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఆధునిక విల్లు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ అందించడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ప్రత్యేక విలువిద్య శిక్షణ కేంద్రాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
విలువిద్యలో ఏకాగ్రత అత్యంత ముఖ్యమని, ఇది మనస్సును నియంత్రించే కళ అని ఆయన వివరించారు. విద్యార్థులు ఏకాగ్రతతో లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్డీవో రుద్ర, విలువిద్య అధ్యక్షులు గోపాలకృష్ణ, కోచ్ డి సాయిబాబా, స్థానిక తహసీల్దార్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
![]()