గ్యాస్ లీక్ బాధితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి – ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
ప్రజా ఆయుధం దినపత్రిక
గ్యాస్ లీక్ బాధితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి – ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజమహేంద్రవరం, ఏప్రిల్ 30:
రాజమహేంద్రవరం గెయిల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మధుర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని గెయిల్ అధికారులను ఆదేశించారు. గ్రామస్తులతో చేసిన ఒప్పందాలను కూడా కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
నగరం గ్రామాన్ని దత్తత తీసుకోవడం, పీహెచ్సీని 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం, గ్రామంలో రహదారులు, డ్రైనేజీ సమస్యలను పూర్తిగా పరిష్కరించడం వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదనంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందిగా కోరారు.
ప్రమాదం అనంతరం గ్రామంలో భద్రతా ప్రమాణాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల్లో నమ్మకం పెంచేలా గెయిల్ సంస్థ పనిచేయాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాలుగా సహాయం అందించాల్సిందిగా తెలిపారు.
అలాగే స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారంపై గెయిల్ అధికారులతో ఎమ్మెల్యే సమగ్రంగా చర్చించారు.
సమావేశంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
![]()