ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే బండారు
ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే బండారు
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం కొత్తపేట/రావులపాలెం, ఏప్రిల్ 28:
ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి, ఉన్నత విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం రూ.60 లక్షల నిధులతో కొత్తపేట, రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి రాష్ట్ర భవిష్యత్తు అని, వారికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టితో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సదుపాయాల విస్తరణకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. యువతకు ఉన్నత విద్య అనంతరం ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నారని చెప్పారు.
కొత్తపేట విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూసా 1.0 నిధులతో రూ.14.44 లక్షల వ్యయంతో నిర్మించిన తరగతి గదులను ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. కంప్యూటర్లు అవసరమని విద్యార్థులు కోరగా, కళాశాల అభివృద్ధి కమిటీతో మాట్లాడి రూ.2 లక్షలతో కొనుగోలు చేస్తామని తెలిపారు.
అనంతరం రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.45.52 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, మరిన్ని సదుపాయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంతర్గత సీసీ రహదారులు నిర్మించాలని, డిజిటల్ క్లాస్రూమ్ కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరగా, ఈ పనులను త్వరలోనే చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కళాశాలలో ఏర్పాటు చేసిన జిమ్‌ను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న మెరుగైన ఫ్యాకల్టీ, ఆధునిక సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
![]()