మాట నిలబెట్టుకుని… మానవత్వానికి చిరునామాగా మంత్రి వాసంశెట్టి సుభాష్
మాట నిలబెట్టుకుని… మానవత్వానికి చిరునామాగా మంత్రి వాసంశెట్టి సుభాష్
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం కాకినాడ/కాజులూరు, ఏప్రిల్ 28:
రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో పడివున్న అభాగ్యుడికి అండగా నిలిచి, మానవత్వాన్ని చాటుతూ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి ఆదర్శంగా నిలిచారు. సహాయం కోసం ఎవరూ లేని వ్యక్తికి కార్పొరేట్ వైద్యం అందించి శస్త్రచికిత్స చేయించడం ద్వారా తన మాట నిలబెట్టుకున్నారు.
కాజులూరు మండలం చేదువాడ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా, కాలు విరిగి చిన్న గుడిసెలో పడివున్న పులిగడ్డ నాగేంద్రుడు (దాసు)ను మంత్రి గమనించారు. వెంటనే స్పందించి అంబులెన్స్ ద్వారా కాకినాడలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.
వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించగా, ఎటువంటి వెనుకడుగు లేకుండా చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చిన మంత్రి, ఆ మాటను నిలబెట్టుకున్నారు. మంగళవారం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. అనంతరం నాగేంద్రుడు భావోద్వేగంతో మంత్రి సుభాష్‌కు, ఆయన తండ్రి వాసంశెట్టి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు.
*సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం*
మంత్రి అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో బాధితుడి బాధ్యతలను సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యంకు అప్పగించారు. ఆయన స్వయంగా ఆసుపత్రికి వెళ్లి నాగేంద్రుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి శస్త్రచికిత్స జరిగే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు.
తెలియని వ్యక్తిని సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకోవడం పట్ల ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు ప్రశంసలు కురిపించారు.
*ఆశ్రయం కల్పిస్తామన్న హామీ*
నాగేంద్రుడికి కుటుంబం ఎవరూ లేరని తెలుసుకున్న మంత్రి, అతని పూర్తి బాధ్యతలను స్వీకరించారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా అవసరమైన సదుపాయాలు కల్పించారు. కోలుకున్న అనంతరం అతనికి ఆశ్రయం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సంఘటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, పదవులకంటే మానవత్వమే గొప్పదని మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి నిరూపించారని వ్యాఖ్యానిస్తున్నారు.
![]()