మండపేటలో డీజిల్, పెట్రోల్ కొరత లేదు – తహశీల్దార్ పి. తేజేశ్వరరావు స్పష్టం
ప్రజా ఆయుధం దినపత్రిక
మండపేటలో డీజిల్, పెట్రోల్ కొరత లేదు – తహశీల్దార్ పి. తేజేశ్వరరావు స్పష్టం
ప్రజా ఆయుధం మండపేట, ఏప్రిల్ 27:
మండపేట టౌన్, మండలంలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని మండపేట తహశీల్దార్ పి. తేజేశ్వరరావు స్పష్టం చేశారు.
తహశీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బంక్ యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవసరానికి మించి డీజిల్, పెట్రోల్ తీసుకెళ్లడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడుతోందని తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆయిల్ కంపెనీల నుండి బంకులకు 20 శాతం అదనంగా సరఫరా జరుగుతోందని వెల్లడించారు.
ప్రజలు వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూ, రైతులకు అవసరమైన డీజిల్‌ను గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకుల సంతకం మరియు స్టాంప్ ఉన్న కూపన్ ఆధారంగా మాత్రమే సరఫరా చేయనున్నట్లు తెలిపారు. వరి కోత మిషన్లకు ఒక రోజుకు 100 లీటర్ల చొప్పున కేన్ లేదా టిన్ ద్వారా డీజిల్ అందిస్తామని పేర్కొన్నారు.
అత్యవసర మరియు నిత్యావసర సేవలకు యథావిధిగా ఇంధన సరఫరా కొనసాగుతుందని, ఇతర అవసరాలకు బల్క్‌గా ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బల్క్ విక్రయాలు లేదా బ్లాక్ మార్కెట్‌కు తరలింపు జరిగితే సంబంధిత బంక్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మండపేట పట్టణ సీఐ డి. సురేష్, రూరల్ సీఐ పి. దొరరాజు, ఎస్ఐ వి. కిషోర్, మండల వ్యవసాయ అధికారి కె. ప్రభాకర్, డిప్యూటీ తహశీల్దార్ పి.ఎ. మెహర్ బాబా, పలువురు పెట్రోల్ బంక్ యజమానులు పాల్గొన్నారు. బంక్ యజమానులు తెలిపిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారు.
![]()