సౌదీలో మృతి చెందిన తోరాటి సత్యనారాయణ మృతదేహం కుటుంబానికి అప్పగింత – KCM సమన్వయంతో విజయవంతమైన ప్రక్రియ
ప్రజా ఆయుధం దినపత్రిక
సౌదీలో మృతి చెందిన తోరాటి సత్యనారాయణ మృతదేహం కుటుంబానికి అప్పగింత – KCM సమన్వయంతో విజయవంతమైన ప్రక్రియ
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 28:
సౌదీ అరేబియాలో గుండెపోటుతో మరణించిన రాజానగరం మండలం కొత్త తుంగపాడు గ్రామానికి చెందిన తోరాటి సత్యనారాయణ (సుమారు 40 సంవత్సరాలు) మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు విజయవంతంగా అప్పగించినట్లు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (KCM) అధికారులు తెలిపారు.
ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లి డ్రైవర్గా పనిచేస్తున్న తోరాటి సత్యనారాయణ 2026 ఏప్రిల్ 11న గుండెపోటుతో మరణించారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు లోనై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను సంప్రదించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే కుటుంబాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పంపించగా, రాజమండ్రి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించి కేసును వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. లచ్చారావుకు అప్పగించారు. అనంతరం KCM బృందం బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపి, భారత రాయబార కార్యాలయం (రియాద్)తో సమన్వయం చేస్తూ అవసరమైన పత్రాల ప్రక్రియను వేగవంతం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, APNRT, భారత రాయబార కార్యాలయం రియాద్ సమన్వయంతో మృతదేహాన్ని సౌదీ అధికారులు భారత రాయబార కార్యాలయానికి అప్పగించారు. అనంతరం కార్గో విమానంలో హైదరాబాద్కు తరలించగా, అక్కడి నుంచి APNRT ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా కొత్త తుంగపాడు గ్రామానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ సహాయ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. లచ్చారావు, KCM సమన్వయ అధికారి గోళ్ళ రమేష్, సిబ్బంది కడియాల సత్తిబాబు, ఎస్.ఎం. సఫియా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ రావిరాల ప్రత్యేక చొరవకు ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
![]()