గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రాకు తలమానికం – ప్రపంచ దేశాల దృష్టి రాష్ట్రంపై: ఎంపీ హరీష్ బాలయోగి
ప్రజా ఆయుధం దినపత్రిక
గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రాకు తలమానికం – ప్రపంచ దేశాల దృష్టి రాష్ట్రంపై: ఎంపీ హరీష్ బాలయోగి
ప్రజా ఆయుధం విశాఖపట్నం, ఏప్రిల్ 27:
గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలుస్తుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అన్నారు. వైజాగ్‌లో జరిగిన డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన ఉద్దేశించి మాట్లాడారు.
లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపుగా నిలుస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రెండు లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఇది నిరుద్యోగ యువతకు పెద్ద శుభవార్త అని పేర్కొన్నారు.
భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర రైల్వే మరియు ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఎంపీ హరీష్ బాలయోగి విశాఖ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక మరియు సాంకేతిక శక్తిని పెంపొందించడంలో ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా సామర్థ్యం కారణంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో నూతన అభివృద్ధి శకం ప్రారంభమైందని ఎంపీ గంటి హరీష్ బాలయోగి పేర్కొన్నారు.
![]()