ఇంధన సరఫరా సాధారణ స్థితికి – బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు: జాయింట్ కలెక్టర్ హెచ్చరిక
ప్రజా ఆయుధం దినపత్రి
ఇంధన సరఫరా సాధారణ స్థితికి – బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు: జాయింట్ కలెక్టర్ హెచ్చరిక
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 28:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల నెలకొన్న పెట్రోలు, డీజిల్ సరఫరా అంతరాయాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమై చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ వైఖోం నిధియా దేవి తెలిపారు. ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేస్తూ, అధికారులతో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తీసుకువస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం నూరుపది పెట్రోలు బంకుల్లో పది బంకులు వివిధ కారణాల వల్ల మూతపడినప్పటికీ, ఈనెల ఇరవై తొమ్మిదో తేదీ నాటికి వాటిని పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నూరు బంకుల్లో ఏడువందల ముప్పై నాలుగు కిలోలీటర్ల పెట్రోలు, ఆరు వందల పదిహేడు కిలోలీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం రోజువారీ సరఫరాలో నాలుగు వందల ఎనభై ఐదు కిలోలీటర్ల పెట్రోలు, ఏడు వందల ఎనభై నాలుగు కిలోలీటర్ల డీజిల్ జిల్లాకు చేరుతున్నాయని చెప్పారు. నేడు జిల్లాకు చేరిన నిల్వలు రెండువందల అరవై కిలోలీటర్ల పెట్రోలు, మూడు వందల అరవై ఐదు కిలోలీటర్ల డీజిల్ అని వివరించారు.
రానున్న వారానికి అవసరమయ్యే ఇంధనం వెయ్యి రెండు వందల అరవై కిలోలీటర్ల పెట్రోలు, వెయ్యి తొమ్మిది వందల ఎనభై కిలోలీటర్ల డీజిల్‌గా అంచనా వేశారు.
ప్రతి పెట్రోలు బంకుపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసి సరఫరా, అమ్మకాలపై నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అంబులెన్సులు, ప్రజా రవాణా వాహనాలు, నీరు, పాలు ట్యాంకర్లు, వంట గ్యాస్ సరఫరా వాహనాలకు నిరంతర ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వ్యవసాయ అవసరాల దృష్ట్యా వరి కోతలు, ఆక్వా రంగానికి డీజిల్ సరఫరాను తహసీల్దార్ల సిఫార్సు మేరకు కూపన్ల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఇకపై పెట్రోలు బంకుల వద్ద బాటిళ్లు, క్యాన్లు, డ్రమ్‌లలో ఇంధనం నింపడం పూర్తిగా నిషేధించబడిందని పేర్కొన్నారు.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జాయింట్ కలెక్టర్, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. జిల్లాలో ఇంధన కొరత తాత్కాలికమేనని, ఎక్కడా సరఫరా అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
క్షేత్రస్థాయిలో ఎక్కడైనా అక్రమాలు గమనించినా లేదా వదంతులు వినిపించినా వెంటనే కలెక్టరేట్ నియంత్రణ గదికి సమాచారం ఇవ్వాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు, వాహనదారులు, వినియోగదారులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా సరఫరా అధికారి ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
![]()