పెట్రోల్-డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – రైతులను ఇబ్బంది పెడితే రోడ్డెక్కుతాం: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
ప్రజా ఆయుధం దినపత్రిక
పెట్రోల్-డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – రైతులను ఇబ్బంది పెడితే రోడ్డెక్కుతాం: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
ప్రజా ఆయుధం మండపేట, ఏప్రిల్ 27:
రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతను ఆయిల్ కంపెనీలు లాభాల కోసం కృత్రిమంగా సృష్టిస్తున్నాయని, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు వాటికి వత్తాసు పలుకుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు తీవ్రంగా విమర్శించారు.
సోమవారం మండపేటలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని ఆరోపించారు. యూరియా కోసం రైతులు, రేషన్ కోసం పేదలు, గ్యాస్ కోసం గృహిణులు లైన్లో నిలబడాల్సి వస్తోందని, ఇప్పుడు పెట్రోల్-డీజిల్ కోసం వాహనదారులు కూడా క్యూలో నిలబడాల్సి వస్తోందని విమర్శించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రైతులకు అనుకూలంగా లేవని, ఇలాంటి సమయంలో ఇంధన కొరత రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రైతులకు నష్టం కలిగితే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని హెచ్చరిస్తూ, రైతులను ఇబ్బంది పెడితే రోడ్డెక్కుతామని స్పష్టం చేశారు.
సామాన్య ప్రజలు చిన్న వాహనాలపై ఆధారపడి జీవిస్తున్నారని, ఇంధన కొరత వల్ల వారి జీవన విధానం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, ఆయిల్ కంపెనీలు ధరలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. దీనివల్ల వివాహాలు, ప్రయాణాలు, రోజువారీ జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు కంపెనీల లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.
ప్రజలు ఈ పరిస్థితులను గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు.
ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్, రాయవరం మండల కన్వీనర్ వెలగల సత్యనారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిపురం శ్రీనివాస్, సూరంపూడి సత్యప్రసాద్, వాసు రెడ్డి అర్జున్, పోతంశెట్టి సత్యనారాయణ రెడ్డి, పలివేల మధు తదితరులు పాల్గొన్నారు.
![]()