మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలకు బుద్ధిచెప్పాలి – ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
ప్రజా ఆయుధం దినపత్రిక
మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలకు బుద్ధిచెప్పాలి – ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 27:
చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ వంటి పక్షాలు అడ్డుకోవడం ద్వారా మహిళా సాధికారతకు తీవ్ర అన్యాయం చేశాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.
విపక్షాల వైఖరికి నిరసనగా అమలాపురంలో సోమవారం ఎన్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన “జన ఆక్రోశ మహిళా సమ్మేళనం”లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హరీష్ మాధుర్, ఇతర ఎమ్మెల్యేలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెట్ల రమణబాబు నివాసం నుంచి గడియార స్థంభం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో విపక్షాలు వ్యతిరేకించడం చీకటి రోజుగా పేర్కొన్నారు.
మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి ఉంటే అన్ని రంగాల్లో వారు మరింత ముందడుగు వేసేవారని అన్నారు. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు అవసరమని చెప్పే పార్టీలు చట్టసభల్లో మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నాయో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు.
రాజకీయ దురుద్దేశాలతోనే మహిళా బిల్లును అడ్డుకున్నారని విమర్శిస్తూ, మహిళలంతా ఒక్కటై ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. మహిళలకు కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలు అన్యాయం చేశాయని విమర్శించారు.
దేశవ్యాప్తంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళా సాధికారత దిశగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
![]()